22, జూన్ 2016, బుధవారం

అక్రమాల ఖజానా!



గుంటూరు జిల్లా ఖజానాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. శాఖకు సంబంధించి జిల్లాలో అనేక అవినీతి.. అక్రమాలు తరచుగా వెలుగుచూస్తునే ఉండటం విస్మయపరుస్తోంది. అయినా బాధ్యులైన యంత్రాంగంపై చర్యలు ఉండటం లేదు. దీంతో నానాటికి అవినీతి.. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంద నే అభిప్రాయం లేకపోలేదు. తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు తన బంధువుల ఖాతాలోకి రూ.30 లక్షలు మళ్లించినట్లు ఇటీవల బయటపడటంతో మరోసారి జిల్లా ఖజానాశాఖ వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి.
రేపల్లెలో రూ.24 లక్షలు
గతేడాది రేపల్లె ఉప ఖజానా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సంబంధించిన రూ.24 లక్షల చెక్కును యార్డుకు చెందిన కొందరు ఉద్యోగులు, స్థానిక ఖజానా కార్యాలయ సిబ్బంది, అధికారులు కలిసి పక్కదారీ పట్టించినట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది మరవకుండానే తాజాగా తెనాలిలో దాన్ని తలదన్నేలా అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు సుమారు రూ.కోటికి పైగా నిధులు తన బంధువుల ఖాతాలోకి మళ్లించినుట్ల శాఖ ఉన్నతాధికారులు అనుమానించి ఈమేరకు తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా గుంటూరు జిల్లాలో అక్రమాలు జరగటం ప్రశ్నార్థకమవుతోంది. శాఖ ఉద్యోగులే కొందరు జిల్లా శాఖలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటా.. రెండా కప్పిపుచ్చుకోవటానికి.. సరిపుచ్చుకోవటానికి అని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో జరిగే అవినీతి వ్యవహారాల్లో ఏమైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిధులకు కాపలా కుక్కలా వ్యవహరించాల్సిన ఖజానా అధికారులే వాటిని భక్షించే ప్రయత్నం చేయటం విమర్శలకు దారితీస్తోంది. గత మూడేళ్ల నుంచి చూస్తే అనేక అక్రమాలు జిల్లాలో బయటపడ్డాయని అయినా ఎవరిపై సరైన చర్యలు లేవని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
రూ.90 లక్షల చెల్లింపునకు వూతం
కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కొందరు ఖజానా అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులకు 2010 వేతన సవరణ బకాయిలు (పీఆర్సీ) రూ.90 లక్షల చెల్లింపులకు సహకరించారని ఖజానా అధికారుల తీరును ఎండగడుతూ జిల్లా నిఘా విభాగం (జిల్లా విజిలెన్స్‌) ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయినా జిల్లా శాఖలో పెద్దగా మార్పు రాలేదు. ఒప్పంద ఉద్యోగులకు పీఆర్‌సీ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా ఎందుకు చెల్లింపులు చేశారని ఖజానా ఉద్యోగులపై ఉన్నతాధికారులు కనీసం చర్యలు తీసుకోలేదు. ఇదే విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఐదుగురు అధికారులను బాధ్యులను చేసి వారికి తాకీదులు జారీ చేసి సంజాయిషి కోరింది. ఈ రకమైన చర్యలు ఖజానాశాఖ ఉద్యోగులపై ఎందుకు తీసుకోలేదో.. ఉన్నతాధికారులకే తెలియాలి.
పర్యవేక్షణ ఏదీ?
జిల్లాలో చాలా మంది ఎస్‌టీఓ, ఏటీఓలు గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు చిరుద్యోగులు అక్రమాలకు తెరదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులకు ఆయా కార్యాలయాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదని వారానికి మూడు, నాలుగు రోజులు చుట్టపు చూపుగా విధులకు హాజరవుతారని కొందరి ఉద్యోగులపై ప్రభుత్వ శాఖల నుంచి విమర్శలు లేకపోలేదు. ఇలా గుంటూరు నుంచి వెళుతున్న ఉద్యోగుల్లో కొందరు నెలవారీ మాముళ్లుముట్టజెప్పి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి జిల్లా శాఖలో జరుగుతున్న అనేక అక్రమాలను మాముళ్లతో చక్కబెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి జిల్లా అధికారి తరచుగా కార్యాలయాలు తనిఖీ చేసి ఉద్యోగులను అప్రమత్తం చేయాలి. కానీ ఈ తరహా తనిఖీలు జిల్లాలో లేకపోవటం వల్లే జిల్లా శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న అభిప్రాయం శాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది.
మొన్న నరసరావుపేటలో..
ఇటీవల నరసరావుపేట ఖజానా కార్యాలయంలో మరో అక్రమం బయటపడింది. రొంపిచర్ల పీహెచ్‌సీలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పేరుతో రూ.45 వేలు పీఎఫ్‌ బిల్లు చెల్లించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. అసలు జిల్లా వైద్యఆరోగ్యంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు కన్సాలిడేటెడ్‌ జీతం మినహా ఎలాంటి భత్యాలు లేవు. అదేమీ గుర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగికి మాదిరి కాంట్రాక్టు ఉద్యోగికి పీఎఫ్‌ అమౌంట్‌ రూ.45 వేలు జమ చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. అయినా దీనికి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు.
తనిఖీలకు వెళితే పనులు స్తంభిస్తాయ్‌ : సురేంద్రబాబు, జిల్లా ఖజానా అధికారి
తాను నెలవారీ కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేయటం అనేది అసాధ్యం. అలా వెళితే ఎస్‌టీఓ, ఏటీఓలు సక్రమంగా పనిచేసుకోలేరు. వారి పనులు స్తంభిస్తాయి. నేను వెళ్లినప్పుడల్లా వారు నా వద్దే ఉంటే పనులు స్తంభిస్తాయి కదా? అందుకే వార్షికంగా ప్రతి కార్యాలయానికి ఒకసారి తనిఖీకి వెళుతున్నా. అంత మాత్రాన పర్యవేక్షణ లేమి ఉందని అనుకోను. తనతో పాటు ఏజీ కార్యాలయ అధికారులు తనిఖీలు చేస్తారు. వారి పరిశీలనలో కూడా తెనాలిలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రాకపోవటం ఆశ్చర్యమేసింది. దీని వెనక ఏం జరిగిందో పరిశీలన పూర్తయితే గానీ చెప్పలేను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి