
గుంటూరు జిల్లా ఖజానాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. శాఖకు సంబంధించి జిల్లాలో అనేక అవినీతి.. అక్రమాలు తరచుగా వెలుగుచూస్తునే ఉండటం విస్మయపరుస్తోంది. అయినా బాధ్యులైన యంత్రాంగంపై చర్యలు ఉండటం లేదు. దీంతో నానాటికి అవినీతి.. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంద నే అభిప్రాయం లేకపోలేదు. తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు తన బంధువుల ఖాతాలోకి రూ.30 లక్షలు మళ్లించినట్లు ఇటీవల బయటపడటంతో మరోసారి జిల్లా ఖజానాశాఖ వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి.
గతేడాది రేపల్లె ఉప ఖజానా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన రూ.24 లక్షల చెక్కును యార్డుకు చెందిన కొందరు ఉద్యోగులు, స్థానిక ఖజానా కార్యాలయ సిబ్బంది, అధికారులు కలిసి పక్కదారీ పట్టించినట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది మరవకుండానే తాజాగా తెనాలిలో దాన్ని తలదన్నేలా అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు సుమారు రూ.కోటికి పైగా నిధులు తన బంధువుల ఖాతాలోకి మళ్లించినుట్ల శాఖ ఉన్నతాధికారులు అనుమానించి ఈమేరకు తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా గుంటూరు జిల్లాలో అక్రమాలు జరగటం ప్రశ్నార్థకమవుతోంది. శాఖ ఉద్యోగులే కొందరు జిల్లా శాఖలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటా.. రెండా కప్పిపుచ్చుకోవటానికి.. సరిపుచ్చుకోవటానికి అని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో జరిగే అవినీతి వ్యవహారాల్లో ఏమైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిధులకు కాపలా కుక్కలా వ్యవహరించాల్సిన ఖజానా అధికారులే వాటిని భక్షించే ప్రయత్నం చేయటం విమర్శలకు దారితీస్తోంది. గత మూడేళ్ల నుంచి చూస్తే అనేక అక్రమాలు జిల్లాలో బయటపడ్డాయని అయినా ఎవరిపై సరైన చర్యలు లేవని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
